Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : ఉన్నతాధికారుల ఆదేశాలపై గంజాయి, తదితర మత్తుపదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పలుచోట్ల గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా మంగళవారం రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మరియు లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 2 లక్షలు విలువచేసే 5 కేజీల ఎండు గంజాయి మరియు 1 కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ సూచనలతో నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు తన సిబ్బందితో మండలంలోని చమ్మచింత జంక్షన్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమయంలో రెండు బైకులపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి వెనుకకు తిరిగి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. పోలీసులు ఆప్రమత్తంగా వ్యవహరించి పారిపోతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని ప్రశ్నించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. ఈ సంఘటనలో అల్లూరి సీతారామరాజు జిల్లా వంతల గుమ్మి గ్రామానికి చెందిన వంతల బుజ్జిబాబు (33), వంతల ఈశ్వర్ (19), నల్గొండ జిల్లాకు చెందిన కూతాటి శివకుమార్ (23), మహమ్మద్ ఫుర్ఖాన్ (20) లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 కిలోల ఎండు గంజాయి, 1కిలో లిక్విడ్ గంజాయి, రెండు మోటారు సైకిళ్ళు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఈ సమావేశంలో నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Rapid TV