Rapid TV - Andhra Pradesh / Anakapally : రాష్ట్రవ్యాప్తంగా ఎం ఎస్ ఎం ఈ కేంద్రాలు పెట్టడానికి ప్రతిపాదనలు పరిశీలన, రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ., సెర్ఫ్., ఎన్ ఆర్ ఐ., ఎమ్పవర్ మెంట్ శాఖల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ *అనకాపల్లి, జూలై 19: ఎం ఎస్ ఎం ఈ శిక్షణా కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా పెట్టడానికి పరిశీలన చేస్తున్నట్లు ఎం ఎస్ ఎం ఈ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి లో ఏర్పాటు చేసిన ఎం ఎస్ ఎం ఈ శిక్షణా కేంద్రాన్ని శుక్రవారం ఉదయం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతోనూ శిక్షణ పొందుతున్న విద్యార్థులతోనూ ఎం ఎస్ ఎం ఈ ఉద్యోగులతో ఆయన సమావేశం అయ్యారు. ఎం ఎస్ ఎం ఈ టెక్నాలజీ సెంటర్ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు.* *ఈ సందర్భంగా ముందుగా శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధి, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 ఎం.ఎస్.ఎం.ఇ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఒకటే ఏపీ ఎస్ సి జెడ్ అచ్యుతాపురం లో ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ శిక్షణా కేంద్రం అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం 2000 మందితో ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం 3000 మంది శిక్షణ పొందుతున్నారని మంత్రి తెలిపారు. 5000 మందికి శిక్షణ పెంచాలని ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 8వ తరగతి కనీస విద్యార్ధతో ప్రారంభమై ఎంటెక్ చదివిన వారికి ఈ శిక్షణ సంస్థలో ప్రవేశం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు చూపెట్టడం జరుగుతుందని చెప్పారు. ఎం ఎస్ ఎం ఈ శిక్షణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే విషయాన్ని చర్చించారు. ఎస్ ఈ జెడ్ నెలకొల్పిన ఈ శిక్షణా కేంద్రానికి , ఎక్స్టెన్షన్ కేంద్రాలుగా జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా ఏ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు అదే జిల్లాలో అక్కడ అవసరాల బట్టి శిక్షణతో పాటు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.* ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, విశాఖ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణపతి, అనకాపల్లి, ఆటోనగర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV