Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా యలమంచిలి : రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో డి-పట్టా భూములను వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దళిత రైతులు చేపట్టిన ఆందోళన శనివారంతో 147వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ్ కుమార్ మద్దతు ప్రకటించి నిరసన శిబిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1978లో 44 ఎకరాల భూమిని భూమిలేని ఎస్సీ నిరుపేదలకు అసైన్‌మెంట్‌గా ఇచ్చారని, లబ్ధిదారులు దాదాపు 47 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అలాంటి భూములను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రిజంప్షన్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. నోటీసులు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించి భూములను వెనక్కి తీసుకున్నారని, దీనిలో రాజకీయ జోక్యం ఉందని రైతులు చెబుతున్న విషయాలను ప్రభుత్వం విచారించాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ పేరుతో భూములు స్వాధీనం చేసుకుని, వాస్తవానికి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులపై వేధింపులు నిలిపివేయాలని, ఇప్పటికే జారీ చేసిన రిజంప్షన్ ఆదేశాలను రద్దు చేసి 44 ఎకరాల భూమిని రైతులకు తిరిగి అప్పగించాలని కోరారు. అలాగే, రైతులు నిజంగా భూమిని సాగు చేయడం లేదని ప్రభుత్వం భావిస్తే, వారికి తగిన గడువు ఇచ్చి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Reporter
Rapid TV